నా ప్రేమ మీవల్లే సక్సెస్‌ అయింది: బాల్క సుమన్‌ | Sakshi
Sakshi News home page

నా ప్రేమ మీవల్లే సక్సెస్‌ అయింది: బాల్క సుమన్‌

Published Mon, Feb 25 2019 3:54 PM

My Love success because of Padma rao says Balka Suman  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు సభలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ.. పద్మారావు గౌడ్‌తో తన వ్యక్తిగత అనుబంధం గురించి సభలోని సభ్యులతో పంచుకున్నారు. తన ప్రేమ వివాహానికి పద్మారావు గౌడ్ అన్నీ తానై ముందు నిలిచారని.. ఆయన వల్లే తన వివాహం జరిగిందని చెప్పారు. 

ఈ విషయం సభలో చెప్పవద్దో లేదో తనకు తెలియదని, కానీ పద్మారావు గౌడ్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పడానికి ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానని తెలిపారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌వి అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు, వివాహానికి తన అత్త మామలు ఒప్పుకోలేదన్నారు. తాను ప్రేమించిన అమ్మాయి పద్మారావు సామాజిక వర్గానికే చెందినవారని, ఆ సమయంలో తనకంటూ ఏది లేదు కాబట్టి అత్త మామలు పిల్లనివ్వడానికి వెనుకాడారని చెప్పారు. దాంతో పద్మారావు అన్ననే వారితో మాట్లాడి ఒప్పించారని, భవిష్యత్తులో సుమన్ ఎమ్మెల్యే అవుతాడని పద్మారావు భరోసా ఇవ్వడంతో తన అత్త మామలు పెళ్లికి ఒప్పుకున్నట్టు సుమన్ తెలిపారు. పద్మారావు గౌడ్ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement
Advertisement